విజ్ఞాపన - ఏప్రిల్ 2020 - పేజి - 1 (సందేశం)


 
విజ్ఞాపన
సంపుటి 2                                              ఏప్రిల్ 2020                                             సంచిక 6



కోవిడ్-19 ప్రపంచ వినాశనానికి వచ్చింది కాదు

(ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తున్న భయంకరమైన విపత్తు "కోవిడ్ 19". దీని గూర్చి అనేకమంది అనేక రకాలుగా వర్ణిస్తున్నారు. వాటిలోని నిజానిజాలు కాలమే బయటపెడుతుంది. అయితే, మనం అనవసర భయాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. పరిశుభ్రత ప్రధానమైంది. క్వారంటైన్ రెండవది. అనగా మనం ఇతరులను కలువకుండా, ఇతరులు మనలను కలువకుండా జాగ్రత్త పడడం (సామాజిక దూరం పాటించడం). తద్వారా, కరోనా గొలుసు తెగిపోతుంది గనుక అది ఇతరులకు సోకకుండా నశిస్తుంది. అప్పుడు, మనతో పాటు మన తోటివారిని కూడా కాపాడుకో గలుగుతాం. గనుక, ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారు, వైద్యులు అందించు సలహాలను, సూచనలను పాటించండి.)

ఈ నేపధ్యంలో సృష్టికర్తయైన దేవుని యందు విశ్వాసముంచిన వారిగా మన భాధ్యతలను జ్ఞాపకం చేయాలని ఈ విషయాలను వ్రాస్తున్నాను.

దేవుడు - సార్వభౌముడు, అనంతజ్ఞాని, అంతటా ఉన్నవాడు, సర్వ శక్తి సంపన్నుడు, శాశ్వతమైనవాడు. పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ప్రేమగలవాడు. ఇంతటి గొప్ప దేవునిని సేవించుచున్న మనం ఎంతటి భాధ్యతాయుతమైన పౌరులంగా ఉండాలో ఆలోచించండి.

1.      ప్రజలను అప్రమత్తం చేయాలి. "నరపుత్రుడా, నేను నిన్ను ... కావలివానిగా నియమించి యున్నాను. గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను" (యిర్మియా 33:7). ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రస్తుత విపత్తు నుండి ఒక వ్యక్తి తన్ను తాను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియచెప్పుట. రెండవది, రాబోవు దేవుని ఉగ్రతకు నుండి కాపాడుకొనుటకు ఏవిధంగా సిద్ధపడాలో తెలియజెప్పుట.

మొదటిగా, ప్రస్తుత విపత్తు నుండి బయటపడుటకు ప్రభుత్వం వారు, వైద్యులు అనేకమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. వాటిని అవగాహన చేసుకుని ప్రజలకు నేర్పించవలసిన భాద్యతను వహించాలి. తగిన సేవా కార్యక్రమాలు చేపట్టాలి. అవసరంలో ఉన్నవారికి తగిన సహాయం అందించాలి.
రెండవదిగా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు ప్రజలకు దేవుని జ్ఞానాన్ని అందించాల్సిన భాద్యత కూడా మనదే. ప్రతి మనిషి తన దృష్టిలో తాను నీతిమంతుడే. కాని దేవుని ఎదుట నిలువ బడినపుడే అతడు ఎంతటి ఘోరమైన పాపియో అర్థమవుతుంది. ఎందుకనగా, మానవుని సృజించిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన యందు ఎటువంటి అక్రమము, అవినీతి లేదు. సృష్టికర్తయైన వాడు ప్రతి మనిషిని విమర్శించు కాలము ఒకటుంది. మనిషి ఇప్పుడు తనకిష్టం వచ్చినట్లు మాట్లాడినా, దేవుని ఎదుట నిలువబడినపుడు తన కిష్టం వచ్చినట్లు మాట్లాడ్డానికి, నిర్ణయాలు చేయడానికి కుదరదు. దేవుడు చెప్పిన మాటకు అనగా, దేవుని తీర్పుకు శిరశు వంచాల్సిందే. దేవుని ప్రమాణాల ప్రకారం మనలో ఏ ఒక్కరూ ఆయన యెదుట నీతిమంతులమని నిరూపించుకోలేం.

అందుకే, దేవుడే ఒక పరిష్కార మార్గాన్ని మానవులకు దయచేసాడు. ఆ మార్గం యేసుక్రీస్తే. దేవుడే మన పాపము నిమిత్తం సిలువలో మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది చారిత్రిక వాస్తవం. గనుక, ఎవరైతే, తన పాపమును ఒప్పుకుని, యేసుక్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తారో వారిని దేవుడు రాబోవు ఉగ్రత నుండి తప్పించుటకు సిద్ధంగా ఉన్నాడు.

ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలి. రాబోవు ఉగ్రత (నరకం) నుండి తప్పించు కొనుటకు "కోవిడ్ 19" ఒక హెచ్చరిక. ఇది మనుష్యులను నశింప జేయుటకు వచ్చిన వ్యాధి కాదు. కాని, మనిషిలోని అహంభావాన్ని నశింప జేయుటకు (యిర్మియా 9:23,24) దేవుడు అనుమతించిన హెచ్చరిక. ప్రజలు నమ్మినా, నమ్మక పోయినా హెచ్చరిక చేయాల్సిన భాద్యత మాత్రం నీ మీద ఉందని తెలిసికో.

2.      ప్రజల పక్షంగా దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. "అతడు చచ్చిన వారికిని, బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను" (సంఖ్యా 16:48). "...ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి ... మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది" (యిర్మియా 9:20,21).

ప్రజల పక్షంగా దేవుని యెదుట నిలువబడుట గొప్ప సవాలుతో కూడిన విషయం. ఇది "చచ్చినవారికి, బ్రతికిన వారికి మధ్యన నిలువబడిన" అనుభవం. అంటే, ఒకవేళ ఆ తెగులు ఇంకా మనుష్యులపై దాడి చేయాలంటే, నన్ను దాటి వెళ్ళాలి. అనగా, ఇది గొప్ప భాద్యతతో కూడిన విషయం. మనుష్యులు తప్పించబడాలనే తీవ్రమైన కోరికను తెలియజేస్తుంది. ఎవరైతే, ఇటువంటి అపేక్ష కలిగి ఉంటారో వారు ప్రజల నిమిత్తం త్యాగపూరితమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. ప్రార్థించేవాడే నిజమైన సహాయం చేయగలడు. ఈ మహమ్మారి "కోవిడ్ 19" పై యుద్ధం చేస్తున్న వారితో మనం కూడా చేయి కలుపుదాం. మన శక్తి యుక్తులను ఫణంగా పెడదాం. ముందుండి పనిచేయుచున్న వారిని వెనుకనుండి బలపరచవలసిన అవసరత ఉంది.

"కోవిడ్ 19" మనలను గృహ నిర్భంధంలోనికి నెట్టేసింది. ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో నిలుచుటకు అవకాశం కల్పించింది. దేవుని సహాయం లేకుండా ఏ సమస్య నుండి మానవుడు తప్పించు కోలేడు. ఇప్పుడీ ప్రపంచ విపత్తు నుండి తప్పించు కోవాలన్నా దేవుని దయ కావాలి. కోవిడ్ మరణాల కంటే హృద్రోగంతో చనిపోవుచున్న వారి సంఖ్యే ఎక్కువ. అయిననూ, కోవిడ్ మనలను ఎక్కువగా భయపెడుతోంది. కారణం ఇది మనిషి నుండి మనిషికి సంక్రమించే వ్యాధి. దీనికి మందు లేదు. గనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

దేవుని సంబందులంగా మనం గ్రహించాల్సిన మరో విషయం ఉంది. అదే సాతాను తంత్రం. ప్రజలు వారి పాపముల నుండి విడిపించ బడకుండా చనిపోవడం సాతాను తంత్రం. ప్రజలు దేవుని రక్షణ మార్గాన్ని గ్రహించకుండా వారి అవివేక యుక్తమైన అతిశయం, స్వనీతి మొదలైన వాటిచేత వారి మనో నేత్రాలకు కలుగు గ్రుడ్డి తనంతోనే ఈ లోకాన్ని విడచి పెట్టేలా చేస్తున్నాడు. ప్రజలు ఈ అంధకారంతో నిండి ఉన్నారు గనుక, వారు సాతాను క్రియలలో పాలివారైతే, సాతానుకి దేవుడు విధించిన శిక్షలో పాలుపొందవలసి వస్తుందనే సంగతి ఎరుగక, సువార్త ప్రకటన అడ్డుకుంటున్నారు.

ప్రజలు వారి అవినీతి అక్రమముల నుండి విడిపింపబడి నీతి కలిగిన జీవితం జీవించేలా చేయడమే మన గురి. దేవుని ఎదుట వారిని నిర్దోషులుగా నిలువబెట్టుట మన సంతోషం. కాని అది లోకానికి మింగుడు పడడం లేదు. మనం రాజ్యాలు స్థాపించాలని కోరుకోవడంలేదు. ఆస్తులు, అధికారాలు సంపాదించాలనే తపన లేదు. అదే మన ఉద్దేశ్యమైతే మనం రాజకీయ పార్టీలు స్థాపించేవాళ్ళం. పోరాటానికి సైనికులను సిద్ధపరచేవాళ్ళం. కాని అవేవీ మనం చేయటం లేదు. చేయబోము.

ఎందుకంటే మన యుద్ధం మనుష్యుల మీద కాదు. మనుష్యులను దుష్టత్వానికి బానిసలుగా చేస్తున్న సాతానుతో యుద్ధం చేస్తున్నాం. వాడు ఓడిపోయిన శత్రువు. సిలువలో క్రీస్తు వానిని జయించాడు. అయిననూ, ప్రజలను మోసపూరితంగా లోబరచుకొనుటకు సాతాను అహోరాత్రులు ప్రయత్నిస్తున్నాడు. వాడెంత ప్రయత్నించినా మనిషి యొక్క అంగీకారం లేకుండా ఏమీ చేయలేడు. గనుక వాడి తంత్రములకు మానవుడు లోబడకుండునట్లు మనం ప్రార్థించాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారి మీద కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు, బలహీన మనస్తత్వం గలవారు త్వరగా అపవాది తంత్రాలలో పడి బానిసలైపోతారు. పర్యవసానం మరణమే, అనగా, దేవుని నుండి నిత్యమైన ఎడబాటు. అదే నరకం. గాని, ఎవరు దేవుని అంగీకరిస్తారో వారే జయించగలరు. గనుక మనం అందరి రక్షణ కొరకు ఆశక్తితో ప్రార్థించాలి.

3.      మనలను మనం కాపాడుకోవాలి. "తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను" (1 కొరింథి 10:12). నీవెంత ఆరోగ్య వంతుడివైనా నిర్లక్ష్యంగా ఉంటే, తగిన జాగ్రత్తలు తీసుకోక పొతే కోవిడ్ బారిన పడే అవకాశం ఉంది. అదే విధంగా, తమ పాపములు ఒప్పుకుని, యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారు సహితం బలహీనమైపోయే అవకాశం ఉంది. దానికి కారణం దేవుని అసమర్ధత కాదు. కాని మన నిర్లక్ష్యం. మనం దేవుని మీద నుండి మన దృష్టిని మరల్చుకుని, "లోకం" అనగా, శరీరాశ (lust of the flesh), నేత్రాశ (lust of the eye) మరియు జీవపు డంబం (pride of life) వైపు ఆకర్షించబడటమే కారణం. ఇది బౌతిక ప్రపంచాన్ని గూర్చిన ప్రస్తావన కాదు. మన మనస్సులో రేగే అనైతిక ఆశలను గూర్చిన ప్రస్తావన. ఈ ఆకర్షణలు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాయి. కాని మనం జాగ్రత్తగా లేనప్పుడే వాటి ఊబిలో పడతాం. (లేక) నాకేం పరవాలేదులే అని అతిగా ఆత్మవిశ్వాసం ప్రదర్శించి నపుడు పడిపోతాం. మనం తొట్రు పడితే మన వెనుక వచ్చిన వారనేకమంది తొట్రుపడే అవకాశం ఉంది. మనం మంచి మాదిరిని చూపక పొతే, మనం ప్రకటించే సువార్తకు విలువ ఉండదు. మనం చేసే ప్రార్థనా ప్రభావం కనబడదు. గనుక మనలను మనం కాపాడుకుంటూ, ఇతరులు కాపాడబడుటకు సహకరిద్దాం.

దేవుని హెచ్చరికను గమనిద్దాం. భాధ్యతా యుతంగా జీవిద్దాం. ఈ విధంగా మనం ఒకరికి ఒకరం సహకరించు కుంటే, ఈ లోక సమస్యల నుండి తప్పించుకోగలం. దానితో పాటు సాతాను శోధనలకు లొంగి పోవడం వలన కలిగిన పాపం వలన లోకమంతటి మీదికి వచ్చే దేవుని ఉగ్రత నుండి కూడా మనం తప్పించుకోగలం.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
_________________

No comments:

Post a Comment