విజ్ఞాపన (ఫిబ్రవరి 2020)


మీ దుఃఖం ఎవరి కోసం...?

"యేసు వారి వైపు తిరిగి - యేరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి;
మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి." - లూకా 23:28

ఈ దినాల్లో అనేక క్రైస్తవ సంఘాలు "శ్రమ దినాలు" ఆచరిస్తూ ఉంటారు. అనగా, క్రీస్తు మనకొరకు అనుభవించిన శ్రమలను ధ్యానం చేస్తారు. మన సంఘంలో ఆ ఆచరణ లేదు. అయితే, క్రీస్తును ధ్యానించడంలో తప్పు లేదు. అది ఒక క్రైస్తవుని హృదయంలో నిత్యమూ ఉండవలసిన ధ్యానం. దాని వలన ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. కాని, దానితో పాటు ముడి పడి ఉన్న మూఢ నమ్మకాలతో ఎటువంటి ప్రయోజనం లేదు. గనుక ఇటువంటి ఆచారాల విషయంలో మనం జాగ్రత్త వహించాలి.

ఎందుకనగా, సంఘానికి క్రీస్తు అనుగ్రహించిన ఆచారాలు కేవలం రెండే. అవి ఒకటి - బాప్తీస్మం, రెండవది - ప్రభువు రాత్రి భోజనం. ఇవి తప్ప మిగిలిన ఆచారములు కేవలం మానవ కల్పితములు. అందులో కొన్ని మన ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధికి దోహద పడేవి ఉండవచ్చు. కాని జాగ్రత్త వహించక పొతే అవి దేవుని స్థానమును ఆక్రమించే ప్రమాదం ఉంది. తద్వారా మనం సరియైన విశ్వాసంలో నుండి తప్పిపోయి దేవునికి దూరమైపోతాం.

అయితే, సిలువ దారిలో క్రీస్తు చెప్పిన మాటలపై మన ధ్యానాన్ని నిలపాలని కోరుతున్నాను. "యేసు ... మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి" అని చెప్పాడు. ఈ మాటల అంతరార్ధాన్ని మనం గ్రహించాలి. ప్రాధమికంగా, ఇవి యూదుల నుద్దేశించి యేసు పలికిన మాటలు. కారణం - వారు యేసును ఉద్దేశ్య పూర్వకంగా తృణీకరించారు. యేసును చంపివేసి, మాకు బరబ్బను విడుదల చేయుమని పిలాతు యెదుట ఏకగ్రీవముగా కోరుకున్నారు (లూకా 23:18). "ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని" అని పిలాతు చేతులు కడుగు కొనగా, "ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక" అని తమకు తామే యూదులు ప్రకటించుకున్నారు (మత్తయి 27:24,25). ఈ కారణంగా, వారి మీదికి రాబోయే భయంకరమైన వినాశనమును (లూకా 19:41-44) గూర్చి యూదులను హెచ్చరిస్తూ ప్రభువు సిలువ దారిలో ఆ మాటలు పలికాడు.

ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. యేసును తృణీకరిస్తే భయంకరమైన నరకమును ఎదుర్కొనవలసి వస్తుంది. అది నిత్యనరకం. అక్కడ "అగ్ని ఆరదు, పురుగు చావదు" (యెషయా 66:24) అనియు, "ఏడ్పును, పండ్లు కొరుకుటయు" (మత్తయి 22:13) అక్కడ ఉండుననియు బైబిల్లో వ్రాయబడి ఉంది. యేసును ఉద్దేశ్య పూర్వకంగా తృణీకరిచినందుకు ఫలితంగా, మనం కోరుకున్నట్లే దేవుని నుండి నిత్య ఎడబాటు అనగా, నరకం (మత్తయి 25:41) కలుగుతుంది.

గనుక, మనం యేసు క్రీస్తు పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయనను గూర్చి ఏడ్చుట కాదు. మన పాపములను బట్టియే ఆయన శ్రమలను అనుభవించి, మరణ మొంది, సమాధి చేయబడెననియు, మూడవ దినాన తిరిగి లేచిన వాడై, మనకు రావలసిన నరక శిక్ష నుండి విడిపించాడనియు తెలిసికొని మన పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడి ఆయనను ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాలి. ఒకవేళ నీవు రక్షణ పొందిన వాడవైతే, నీ విశ్వాస జీవిత కొనసాగింపునకు ఆటంకంగా ఉన్నవాటి విషయమై పశ్చాత్తాప పడి యేసుతో నీ సంబంధాన్ని మెరుగు పరచుకోవాలి. మనము దినదినమూ ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. ఇందు కొరకే దుఃఖ పడాలి, ఇందుకోరకే ఏడ్చి ప్రార్థించాలి.

మన కుటుంబస్తుల రక్షణ కొరకు, మన ఊరి ప్రజల రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు ఆయన ఎదుట దీనమనస్సుతో ప్రాధేయ పడదాం. ఒక బలమైన ప్రార్థనా కంచె ఏర్పాటు చేద్దాం. మనం ఆచార క్రైస్తవులుగా గాక, క్రియాశీల క్రైస్తవులుగా సాగిపోదాం. ఉవ్వెత్తున లేచే ఉజ్జీవ కెరటానికి నాందిగా నిలుద్దాం.

అందరూ ఆలయానికి సమయానికే రండి. ప్రార్థించండి, ప్రార్ధనా పూర్వకంగా తరలి రండి, ప్రేమతో విధేయులై సహకరించండి, వాక్యపు వెలుగులో స్థిరముగా జీవించండి.

ప్రభువు మిమ్మును దీవించును గాక.




స్తుతి మరియు ప్రార్థనాంశాలు
  1. ఇంతవరకు మనలను కాపాడి, నడిపించిన మన రక్షకుడైన యేసు క్రీస్తునకును, సర్వాధిపతియైన ప్రభువునకును స్తోత్రము కలుగును గాక.
  2. ఈ నెల 18 వ. తేదీన దేవుని సేవకులు షాన్ కేనవన్ గారి కుటుంబం వారి స్వదేశమునకు తిరిగి వెల్లుచున్నారు. గనుక వారి ప్రయాణము కొరకు, క్షేమం కొరకు ప్రార్థించండి. 
  3.  పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి.
  4. సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపడుచున్న మన పిల్లల కొరకు, వారి ఆరోగ్యము కొరకు ప్రార్థించండి.
  5. గత నెలలో వివాహములు జరిగిన నూతన దంపతుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించండి.
  6. ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారి నుండి ప్రజలు విడిపించబడునట్లు ప్రార్థించండి. ముఖ్యంగా చైనా ప్రజల కొరకు, వారు దేవుని గ్రహించునట్లు ప్రార్థించండి.
  7. దేశంలో, రాష్ట్రంలో పలు అంశాలపై జరుగుచున్న అలజడి సమసిపోయి, సమాధానం శాంతి వర్ధిల్లునట్లు ప్రార్థించండి. మీడియా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయక, ప్రజా ప్రయోజన్నాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయ గలుగుటకు తగిన జ్ఞాన వివేకముల నిమిత్తం ప్రార్థించండి.
  8. క్రైస్తవులు లోకాశాలను త్యజించి, దేవుని కొరకు సాక్ష్యులుగా జీవించునట్లు ప్రార్థించుదాం.
  9. కుటుంబ సంబంధాలు బలపడి, తల్లిదండ్రులు పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పించగలుగునట్లు, పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులగుచు, వారిని గౌరవిస్తూ, దేవుని మహిమ పరచునట్లు ప్రార్థించండి. అపవాది యొక్క తంత్రముల నుండి కుటుంబములు కాపాడబడునట్లు ప్రార్థించండి. వృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో ప్రేమ కలిగి యుండునట్లు ప్రార్థించండి.
  10. వృద్ధుల కొరకు, దీర్ఘకాల వ్యాధులతో పోరాడుతున్న వారి కొరకు, ప్రమాద వశాత్తు ఆకస్మికముగా అనారోగ్య పాలైన వారి కొరకు, వారికి ఉపచారము చేయు వారికి కావలసిన సహనం కొరకు, ధైర్యం, ఆదరణ, స్వస్థతల కొరకు, సరియైన వైద్యం కొరకు ప్రార్థించండి.
  11. సమాజంలో పెరిగిపోతున్న అనైతిక జీవిత విధానము, హింస, అక్రమముల నుండి విడిపించబడి నీతి, న్యాయం, సమాధానం, సంతోషం వర్ధిల్లునట్లు ప్రార్థించండి.
  12. సరిహద్దులలో పోరాడుచున్న త్రివిధ దళాల సైనికుల కొరకు, సంబధిత వ్యవస్థల కొరకు, రవాణా వ్యవస్థ కొరకు, పోలీసు వ్యవస్థ కొరకు, న్యాయ వ్యవస్థ కొరకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రార్థించండి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించండి. పరమత సహనం కొరకు ప్రార్థించండి.
  13. అన్యాయముగా శ్రమల ననుభవిస్తున్న వారి విడుదల కొరకు ప్రార్థించండి.
  14. మన మధ్య వాక్య పరిచర్య చేయుచున్న సేవకుల కొరకు, ఆయా ప్రాంతములలోని మన సంఘముల కొరకు, యేసు క్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం కొరకు, ప్రభువు రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూచుట కొరకు ప్రార్థించండి.
  15. సువార్త పరిచర్యలో నిమగ్నమైన సేవకుల కొరకు, అనేకులు యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించగలుగునట్లు, క్రైస్తవులు నశించు ఆత్మల కొరకైన భారముతో నింపబడి విజ్ఞాపన చేయుటకును, సహకరించుటకును ప్రార్థించండి.

బైబిల్ విజ్ఞానం

క్విజ్ నెం 15 - (యోహాను మూడు పత్రికలు & యూదా పత్రిక)

  1. యోహాను ఈ సంగతులను వ్రాయుటకు కారణమేమి?
  2. అబద్ధికుడు ఎవరు?
  3. ఇది కడవరి గడియ అని మనకెట్లు తెలియును?
  4. ఈ పత్రికలలో ప్రస్తావించిన ప్రధాన దూత పేరేమి?
  5. క్రీస్తు విరోధి ఎవడు?
  6. మేలు చేయువాడు ఎవరి సంబంధి?
  7. ఏ హేతువు చేత లోకము మనలను ఎరుగదు?
  8. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమి?
  9. సత్యమునకు సహాయకులు అని ఎటువంటి వారిని గూర్చి చెప్పుచున్నాడు?
  10. దేవుడు మనయందుంచిన ప్రేమ ఏవిధముగా ప్రత్యక్ష పరచబడెను?
క్విజ్ నెం 14 జవాబులు
  1. దేవుడు పరిశుద్ధుడు (1 పేతురు 1:14)
  2. సువర్ణము కంటే అమూల్యము (1 పేతురు 1:7)
  3. మంచి ప్రవర్తన గల వారై యుండాలి (1 పేతురు 2:12)
  4. దుష్టత్వమును కప్పిపెట్టుటకు (1 పేతురు 2:16)
  5. మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిమి (1 పేతురు 3:9)
  6. సాధువైనట్టియు, మృదువైనట్టియు గుణమను అక్షయాలంకారము (1 పేతురు 3:4)
  7. దేవస్వభావము నందు పాలివారగుటకు (2 పేతురు 1:4)
  8. అబద్ధ బోధకులు (2 పేతురు 2:1)
  9. ముందుకు భక్తిహీనులగువారికి దృష్టాంతములుగా ఉంచుటకు (2 పేతురు 2:6)
  10. పౌలు (2 పేతురు 3:15)
క్విజ్ నెం 14 విజేతలు
  1. వి. అనూష
  2. యం. ఎస్తేరు రాణి
  3. వి. విజయ
  4. వి. అర్జున రావు
  5. కె. శాంతకుమారి
  6. సిహెచ్. జయ
  7. వి. అజయ్
  8. బి. క్రీస్తు కుమారి
  9. పి. దుర్గ ప్రసాద్
  10. వి. రమణి
  11. ఐ. శ్రీనివాస రావు
ఒక తప్పుతో వ్రాసిన వారు:
  1. కె. సత్య కుమారి
  2. వై. జవహర్ లాల్
  3. కె. జ్యోతి
  4. జి. బంగారమ్మ
ఒకటి కంటే ఎక్కువ తప్పులతో వ్రాసిన వారు:
  1. జి. కృష్ణవేణి
  2. పి. రాజు
  3. డి. కుమారి
  4. యం. హేమలత
  5. టి. హెప్సిబా
  6. యం. పద్మావతి



2 comments:

  1. Praise the lord .
    All glory belongs to god.
    Thank you for creating new website . It is very helpful to us and also our church members .
    Thank you sir from Sekhar Naidu ,First Baptist church.

    ReplyDelete