ఆదివారం ఆరాధన సందేశం
22-03-2020
ప్రభువైన యేసు క్రీస్తు
నామములో మీకు శుభములు కలుగును గాక!
నా జీవిత కాలంలో ఇలాంటి
పరిస్థితిని ఇంతవరకు నేను చూడలేదు. కరోనా వైరస్ ప్రభావం వలన నేడు మన దేశంలో
"జనతా కర్ఫ్యూ" విధించినందున, మనం ఆలయంలో అందరం ఒకచోట కలుసుకునే వీలు
లేనందున ఈ సందేశాన్ని వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తున్నాం.
ఈ వైరస్ ఒకరినుండి ఒకరికి
శీఘ్రముగా వ్యాపిస్తున్నందున సమూహంగా అందరూ ఒకచోట గుమిగూడి ఉండడం ఆరోగ్య కారణం
కాదనే తలంపుతో ప్రభుత్వం వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది మంచిదే. మనలో ఎవరూ
ఈ విషయమై తొందర పడవద్దు. ప్రభుత్వాన్ని విమర్శించవద్దు. వైరస్ క్రిములు ఎక్కువ
సేపు జీవించి ఉండలేవు గనుక కొన్ని రోజులలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని
భావిస్తున్నారు. గనుక, మనం కూడా ప్రార్థనా పూర్వకంగా సహకరిద్దాం. పరిశుభ్రతను
పాటిద్దాం. దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుడు కనికరించక
పొతే మన విధానాలు ఫలించవు. మానవుడు తనకు తానుగా పరిస్థితులను పరిష్కరించుకోలేడు.
అసలు మానవుడు
ఎందుచేత ఇటువంటి భయంకర పరిస్థితులను ఎదుర్కొనుచున్నాడు?
ప్రధాన కారణం, దేవునిపై
మానవుని తిరుగుబాటు.
ఆదికాండం 1వ. అధ్యాయం
ప్రకారం దేవుడు సర్వ సృష్టిని చేసినపుడు దానిని మంచిదిగా, లోపం లేనిదిగా
సృజించాడు. కాని మానవుడు దేవుని విధికి లోబడక, దేవుడు అనుగ్రహించిన
చిత్తస్వాతంత్ర్యాన్ని (అనగా, స్వంతంగా నిర్ణయాలను తీసుకునే శక్తిని) ఉపయోగించి
దేవునిని వ్యతిరేకించాడు. మానవుడు సంపూర్ణ మెలకువతో, ఉద్దేశ్య పూర్వకంగా, స్వేచ్చా
పూర్వకంగా, దేవునికి లోబడాలి. అదే దేవుని చిత్తం. అందులోనే మానవునికి క్షేమం ఉంది.
దేవుని మీద ఆధారపడకుండా మానవుడు తనకు తానుగా బ్రతక గలిగే శక్తిమంతుడు కాదు.
ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఈ విషయం మనకు ఇట్టే అర్థమైపోతుంది. కాని మానవుడు దేవునిని
వ్యతిరేకించి, తనకు తానుగా జీవించగలనని అనుకున్నాడు. అదే మానవుని జీవితంలో
కష్టాలకు కారణ మయ్యింది. మానవుని నైతిక జీవిత విధానం దిగజారిపోయింది. ఎక్కడ చూసినా
అక్రమం.
'దేవుని మాట వింటే అది
జీవమని, వినకపోతే అది మానవునికి మరణమని' దేవుడు మానవుని ముందుగానే హెచ్చరిచాడు
(ఆదికాండం 2:16,17). అయినప్పటికీ, మనిషి దేవుని మాటను లెక్కచేయలేదు. ఇలా దేవునిని,
ఆయన అధికారాన్ని దిక్కరించడమే పాపం. ఈ పాప ప్రభావంతో మానవుడు రకరకాల అక్రమాలకు
పాల్పడుచున్నాడు. అందువలన మానవుని కష్టాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి.
ఇప్పటికైనా మించిపోయింది లేదు దేవుని లోబడి ఆయనను సేవిస్తే చాలు. కాని మానవుని
అతిశయం అతనిని దేవునికి లోబడకుండా చేస్తుంది. అయితే, తన ప్రవర్తన యావత్తును బట్టి
మానవుడు దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియలను
బట్టి ప్రతిఫలమిచ్చును. ఆయనను వ్యతిరేకించు వానికి నిత్యనరకం ప్రాప్తిస్తుంది.
కాని, ఆయనతో నిలిచిన వారికి తనతో ఉండే ధన్యత లభిస్తుంది. అదే నిత్యజీవం.
రెండవది, మానవుని
నిర్లక్ష్యం.
మానవుడు తన పరిసరాల
విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఉదాహరణకు పర్యావరణ కాలుష్యం. ఇష్టం
వచ్చినట్లుగా వాతావరణాన్ని పాడుచేస్తున్నాడు. రకరకాల వ్యర్థాలను గాల్లోకి,
నీటిలోనికి, భూమిలోనికి, ఆకాశంలోనికి పంపిస్తున్నాడు. అవి మరలా మన మీద దాడి
చేస్తున్నాయి. వాటి నుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఇంకా
తీవ్రంగా మనమీద దాడి చేస్తున్నాయి.
మూడవది, మానవుని
స్వార్థం.
స్వార్థ బుద్ధితో మానవుడు
ఇతరులను దోచుకోటానికి, ఇతరులపై ఆధిపత్యం సాధించడానికి చేసే ప్రయత్నంలో వినాశనకరమైన
ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు. అవన్నీ వికటించి, మనకే నాశనాన్ని
కలుగజేస్తున్నాయి. అణు బాంబుల తయారీ, జీవాయుధాల తయారీ మానవుని స్వార్థ బుద్ధికి మచ్చుతునకలు.
నాల్గవది, మానవుని
ప్రతీకార స్వభావం.
ఎవడైనా తనకు కీడు చేసాడని
భావిస్తే, దానికి ప్రతిగా రెట్టింపు కీడు చేయకుండా వదలిపెట్టే ప్రశక్తే లేదు. ఇదే
మానవుని అసలు స్వభావం. కొందరు వారి స్వభావం బయటకు కనబడేలా వారి క్రియలను చేస్తారు.
మరికొందరు తెలివిగా, తాము చేసే పనులు ఇతరుల కంటబడకుండా చేస్తారు. ఈ స్వభావం వలన
ఒకరికి ఒకరు ఎక్కువ కీడు చేసుకుంటున్నారు. దాని వలన కూడా మానవ జాతి యావత్తు
ఇబ్బంది పడుతుంది.
ఐదవది, మానవుని అసూయ.
ఎదుటివాని మేలు ఓర్చలేని
గుణం. ఒకడు బాగు పడితే చూచి తట్టుకోలేక నిర్దాక్షిణ్యంగా ఆ వ్యక్తీ పై దాడి చేయడం.
అందులో ఎదుటివాడు చేసిన కీడు ఏమీ లేదు కాని, మనలోని అసూయ స్వభావం ఆవిధంగా మనచేత
చేయిస్తుంది. ఎదో ఒకరోజు మనం చేసిందే మన మీదకు వస్తుంది. ఎందుకంటే, దేవుడు
న్యాయవంతుడు.
ఆరవది, దేవుని యొక్క
ప్రేమతో కూడిన దీర్ఘశాంతం.
దేవుడు మన అవిదేయతలను తన
దీర్ఘ శాంతంతో సహిస్తున్నాడు. కాని మానవుడు తన మీదకు శిక్ష రాక పోవడాన్ని గమనించి,
ఇంకా ఎక్కువ ధైర్యంతో దుష్టత్వాన్ని జరిగిస్తున్నాడు. గనుక దేవుడు వారిని
నియంత్రిస్తాడు. అందులో భాగంగా వారి చెడుక్రియలకు తగిన శిక్షలను ప్రతిఫలంగా
అనుభవిస్తారు. ఇది దేవుడు వారిని నశింప జేయుట కొరకు ఇచ్చే శిక్ష కాదు. గాని, వారి
పాపమునకు తగిన ప్రతిఫలం అనుభవించునట్లు దేవుడు వారిని విడచిపెడతాడు. ఉదాహరణకు, విచ్చలవిడి శృంగారం వలన కలిగే ఎయిడ్స్ వ్యాధి,
లేక అక్రమకారులు చట్టం చేతికి చిక్కిపోవడం
మొదలైనవి.
తద్వారా, వారిలో మార్పు
కలిగి, తమ పాపమును బట్టి పశ్చాత్తాప పడి దేవునిని అంగీకరిస్తే వాడు నిత్య
నరకాగ్నిని తప్పించుకుంటాడు. ఈ విషయాన్నే దేవుడు సిలువ ద్వారా తెలియజేసాడు. అయన
మానవులను ప్రేమించాడు. గనుక మన పక్షంగా తాను శిక్షను భరించి, మనం తెలిసికొని
క్షమాపణ వేడుకుంటే క్షమించడానికి ఇష్టపడ్డాడు. గనుక "తన్ను ఎందరంగీకరించిరో
వారికందరికీ అనగా, తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన
అధికారము అనుగ్రహించెను" (యోహాను 1:12).
ముగింపు:
మనము దేవుని మీద ఆధారపడి
బ్రతుకుచున్నవారం. గనుక దేవునిని ఒప్పుకుందాం. ఆయన యేసు క్రీస్తు ద్వారా
అనుగ్రహించిన రక్షణను గ్రహిద్దాం. మన పాపములను క్షమించమని దేవుని యెదుట వినయముతో
వేడుకుందాం. మన మార్గములను సరిచేసుకుందాం. దేవుని భయమును ఇతరులకు నేర్పిద్దాం.
"దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక.
ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక.
అప్పుడు భూమి దాని ఫలములిచ్చును.
దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
దేవుడు మమ్మును దీవించును.
భూదిగంత నివాసులందరు ఆయన యందు భయభక్తులు నిలుపుదురు."
కీర్తన:67:5-7.
No comments:
Post a Comment