How much do you love Jesus?


నీవు యేసును ఎంతగా ప్రేమించుచున్నావు?

(లూకా సువార్త 7:36-50)

ఈ ఉపమానంలో యేసు క్షమాపణను గూర్చి బోధిస్తున్నాడు. ఉపమానం అనగా ఒక కధ. ఇది పరలోక సంబంధమైన భావంతో కూడిన భూసంబంధమైన కధ. ఆయన ఉన్న పరిస్థితులను అనుసరించి యేసు ఉపమానములను చెప్పేవాడు లేక ఎవరైనా ఆయనను ప్రశ్నించినపుడు ఉపమానములను చెప్పేవాడు. ఆయన నిజ జీవితమును గూర్చి ఉపమానములను చెప్పేవాడు. ఈ ఉపమానంలో యేసు క్షమాపణను గూర్చి బోధించాడు. యేసు యెడల మనం ఎంతటి ప్రేమను కలిగి ఉండాలోననే మర్మాన్ని కూడా ఆయన ఉపమానం ద్వారా బోధించాడు. క్షమాపణను గూర్చి నీవు గ్రహిస్తే, లేక క్షమించబడిన అనుభవం నీ జీవితంలో ఉంటే, ఆ అవగాహన లేక ఆ అనుభవం ప్రభువు యెడల నీ ప్రేమను అధికం చేస్తుంది. సీమోను అను పేరుగల పరిసయ్యుడు యేసును తన ఇంటిలో భోజనమునకు ఆహ్వానించి నట్లుగా ఈ వచనాలలో గమనిస్తున్నాం. అతడు యేసును తన యింటిలో భోజనమునకు ఎందుకు పిలిచాడో మనకు తెలియదు. బహుశా ఆయనను గూర్చి ఇంకా తెలిసికోవాలనే ఆశతో పిలిచి ఉండవచ్చు. లేదా ఆయనను విమర్శించాలనే ఉద్దేశ్యముతోనైనా పిలిచి ఉండవచ్చు. యేసు ఈ ఆహ్వానాన్ని అంగీకరించుటకు కారణం ఆయన మనుష్యులను ప్రేమించువాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకే యేసు వచ్చాడు. ఆ పరిసయ్యుని ఇంటి వద్ద జరిగిన సంగతులు నిజమైన క్షమాపణను గూర్చిన ఒక చక్కని పాఠాన్ని బోధిస్తున్నాయి.

       I.            మొదటిగా, ఈ వచనాలలో క్షమాపణను అందుకొన్న వ్యక్తి ఒకరే నని  గమనించండి. అయినప్పటికీ, అక్కడ జరిగిన సంగతులలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు మనం గమనించవచ్చు. వారిలో మొదటివాడు రక్షకుడైన క్రీస్తు - ఆయన ఆహ్వానాన్ని అంగీకరించినవాడు. మనం ఆహ్వానిస్తే యేసు మన వద్దకు వస్తాడని తెలిసికోవడం ఒక అద్భుతమైన సంగతి. మన హృదయాలను ఆయన కొరకు తెరిస్తే ఆయన లోనికి వస్తాడు.
A.    ఆ తరువాత మనకు కనిపించే వ్యక్తి క్షమాపణను అందుకున్న స్త్రీ. అక్కడ జరిగిన సంగతులను గ్రహించాలంటే ఆ దినాలలో ఉన్న సంస్కృతిని అర్థం చేసికోవాలి. యూదుల ఆచార ప్రకారం ఆతిధ్యమివ్వడం ఒక పుణ్యకార్యం. ఇటువంటి సందర్భాలలో పరిసయ్యుడు ఇంటిముందు ఉన్న ఖాళీ స్థలం వంటి బహిరంగ ప్రదేశాలలో భోజన బల్లను ఏర్పాటు చేస్తాడు. ఆ దారిన పోయే వారందరూ ఆ ఇంటాయన చేసే ఆతిధ్యాన్ని చూడాలనే ఉద్దేశ్యంతో ముందున్న తలుపు బాహాటంగా తెరిచే ఉంచుతాడు. కొందరైతే లోపలికి వచ్చి అతడేమేమి సిద్దపరచాడో కూడా చూస్తారు. అందుచేతనే ఆ స్త్రీ క్రీస్తు భోజనం చేయుచున్న స్థలానికి రాగలిగింది. ఈ స్త్రీ అక్కడ ఏయే భోజన పదార్థాలు ఉన్నాయో చూడ్డానికి రాలేదు. ప్రభువును ఆరాధించడానికి వచ్చింది. ఈ స్త్రీ ఎదో విధంగా యేసు క్రీస్తును గూర్చి తెలిసికుంది. అందుచేత, ఆమె తన పాపపు జీవిత విధానమును విడచిపెట్టి క్రీస్తు నందు దొరికే క్షమాపణ పొందాలని ఆశ పడింది. 37 వ. వచనంలో "పాపియైన ఈ స్త్రీ ..." అని వ్రాయబడింది. దానిని బట్టి ఆ పట్టణంలో అందరికీ ఆమె బాగా తెలిసిన వ్యక్తని గ్రహించుచున్నాము. ఆమె వ్యభిచారి అని కొందరు నమ్ముతారు. బైబిల్ అలా చెప్పటం లేదు కాని, అక్కడి మాటలు ఆవిధంగా గోచరిస్తున్నాయి. సీమోను వెంటనే ఆమెను గురుతు పట్టాడు. ఆమె అనేక పాపములు చేసెనని 47 వ. వచనంలో యేసు చెప్పాడు. యేసు ఆ పట్టణంలో ఉన్నాడని తెలిసి నపుడు ఆమె త్వరపడి పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఆమె ఒక అత్తరు బుడ్డి తీసుకు వచ్చింది. కాని ఆమె అత్తరు తెరవడానికి ముందు ఆమె హృదయం తెరువబడి, కన్నీరు ఉబికి ఆయన పాదములను తాకింది. ఆమె కన్నీటితో ఆయన పాదములు తడిసిపోయాయి. ఆయన పాదములను తుడచుటకు ఆమె వద్ద ఏమీ లేదు. గనుక ఆమె పొడవైన తన కురులను విప్పి ఎంతో అణకువతో, ప్రేమతో ఆయన పాదములను తుడిచింది. ఆమె తన పాపముల విషయమై పశ్చాత్తాప పడుతుందని ఈ విధానం ద్వారా తెలియజేసింది. తన పాపములను గుర్తించి, తనకు క్షమాపణ అవసరమనే విషయాన్ని ఒప్పుకుంటోంది. ఆమె కార్చిన కన్నీరు తన పాపములను మాత్రమె కాదు కాని యేసు నందు తన విశ్వాసమును కూడా సూచిస్తున్నాయి. క్షమాపణ కొరకు ఆమె వెతుకుతోంది. ఆయన పాదములను ముద్దు పెట్టు కొనుట ద్వారా యేసు యెడల తనకున్న ప్రేమను ఆమె తెలియజేసింది. ఆయన అనుగ్రహించే క్షమాపణ తాను పొండుకున్నాననే ధైర్యం ఆమెలో కనబడుతుంది. ఆ తరువాత ఆమె ఆ అత్తరును ఆయన పాదముల మీద పోసి ఆయనను ఆరాధించింది.
B.     ఇక మూడవ వ్యక్తి యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు. పరిసయ్యుల ఆచార ప్రాకారం ఒక స్త్రీ పురుషుని తాకితే అతడు మలిన పరచబడినట్లే. అలాంటిది, అంతటి భయంకర పాపియైన స్త్రీ తాకడమంటే వారి దృష్టిలో అది తీవ్రమైన మాలిన్యమే. ఈ స్త్రీ చేసిన పనిని బట్టి సిమోనుతో సహా అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా విబ్రాంతికి గురయ్యారు. ప్రభువైన యేసు పట్ల ఆమె బహిరంగంగా కనుపరచిన ప్రేమను బట్టి ఆశ్చర్యపోయాడు. 39 వ. వచనం - "ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి - ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతెయో, ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను". సీమోనుకు నిజంగా అర్థం కాలేదు. ఆమె పాపాత్మురాలని ఆ ప్రాంతంలో ఆమెకున్న పేరును బట్టి అతనికి తెలుసు. కాని, ఆమె రక్షింపబడిన విషయం అతనికి తెలియదు. పాపము వలన ఆమె జీవితమునకు అంటిన కళంకం అతనికి తెలుసు కాని, కృప వలన ఆమె జీవితంలో సంభవించిన మార్పును గూర్చి తెలియదు. ఈ పరిసయ్యునికి యేసు క్రీస్తు కూడా అర్థం కాలేదు. యేసు ఎవరో ఆయన ఒక వ్యక్తీ జీవితంలో ఏం చేయగలడో ఆ విషయం కూడా అతనికి తెలియదు.
     II.            రెండవదిగా, క్షమాపణను గూర్చిన వివరణను గమనించండి. సీమోను చేసిన కఠినమైన తీర్పును బట్టి యేసు ఈ ఉపమానం చెప్పాడు. సీమోనుకు దేవుని కృప అర్థం కాలేదు. ఈ ఉపమానంలో అప్పిచ్చువానికి ఋణస్థులైన ఇద్దరు వ్యక్తులను గూర్చి మాట్లాడుచున్నాడు. ఒక వ్యక్తి 500 దేనారములు అప్పున్నాడు. అది ఇంచుమించు రెండు సంవత్సరాల సంపాదన. మరొకడు 50 దేనారములు అప్పున్నాడు. అది ఇంచుమించు రెండు నెలల సంపాదన. వారికి అప్పిచ్చిన వాడు వారు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని యెరిగి వారిద్దరిని క్షమించేసాడు. సాధారణంగా, అప్పులిచ్చేవాని మనస్తత్వం అలా ఉండదు కాని ఇది దేవుని లక్షాణాన్ని మనకు చూపిస్తుంది.
A.    క్షమాపణను గూర్చి వాస్తవ భావాన్ని గ్రహించుటకు ఈ ఉపమానం మనకు ఉపయోగపడుతుంది. మన పాపములను బట్టి మనము ఋణస్థులమని బైబిల్ బోధిస్తోంది. "అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోవుచున్నారు". పాపమును బైబిల్ (ఋణము) అప్పుతో పోల్చి చెబుతోంది. ఒకడు 50 దేనారములు, మరొకడు 500 దేనారములు అచ్చియున్నారు. గనుక ఇద్దరూ ఋనస్థులే. కొన్ని సార్లు మనం మనుష్యులను విభజించి చెబుతుంటాం. కొందరిని గూర్చి వీరు పెద్ద పాపులని, మరికొందరిని గూర్చి వీరు చిన్న పాపులని చెబుతాం. వెలిచూపుతో చూసి నపుడు అదే నిజమనిపిస్తుంది. నువ్వు 50 దేనారాల పాపివైనా, లేక 500 దేనారాల పాపివైనా అది ప్రధానమైనది కాదు. మనలను రక్షించువాడు మనకు అత్యవసరం. నీవు పాపివని నీవు గ్రహించకపోతే, నీ జీవితంలో రక్షకుని గూర్చిన అవసరత కూడా నీవెప్పటికీ గ్రహించలేవు. మనమందరమూ పాపులమే. క్షమాపణలో నేర్చుకొనవలసిన మొదటి విషయం ఇదే.
B.     రెండవదిగా, మన పాప ఋణమును చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో మనమున్నాం. మనలో ఎ ఒక్కరూ ఆ ఋణమును చెల్లించలేరు. నేను చిన్న పాపమే చేసానని నీవనుకోవచ్చు. నీవు తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నపుడు అది ఎంతైనా ఒకటే. ఆ ఋణాన్ని నీవు ఎలా చెల్లించ గలవు? దానిని నిర్లక్ష్యం చేయడానికి కుదరదు. అప్పిచ్చేవాడు నువ్వు కట్టకపోతే ఊరుకోడు. కాబట్టి దేవుని యెదుట మన పాప ఋణమును తీర్చుకోడానికి మన వద్ద ఎమీ లేదని గ్రహించాలి.
C.     మూడవదిగా, దేవుడే మన పాప ఋణమును యేసు క్రీస్తులో చెల్లించాడని గ్రహించాలి. 42 వ. వచనంలో - "ఆ అప్పు తీర్చుటకు వారి యెద్ద ఏమియూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను". క్షమించుట అనే పదానికి గ్రీకులో మూల పదం - "కారిజోమై" (charizomai). దానికి కృపతో క్షమించుట లేక ఉచితముగా క్షమించుట అని అర్థం. మనలో ఎదో మంచితనం ఉన్నందున మనకు రక్షణ కలుగలేదు గాని దేవుని యందు కృప ఉన్నందున మనకు రక్షణ కలిగింది. సువార్తలోని శుభ సందేశం అదే. క్రీస్తును నమ్మిన వారందరి పాపములను దేవుడు తన కృపతో క్షమిస్తాడు. అయితే, రక్షణ విలులేనిది కాదు (చవకబారుది కాదు). అప్పిచ్చువాడు నీ అప్పును క్షమించాలంటే, అతడు దానిని భరించాలి. దానికి అతడు మూల్యం చెల్లించాలి. దేవుడు నిన్ను ఉచితముగా క్షమించుచున్నాడంటే ఎవరో ఆ ఋణమును చెల్లించారని గ్రహించాలి. అందుకొరకే యేసు సిలువలో మరణించాడు. మన రక్షణ ఎంత విలువైనదో సిలువను చూస్తే గ్రహించగలం. ఎఫేసి 1:7 - "దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనo అనగా, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది". సిలువలో యేసు క్రీస్తు మరణం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. మనమిది ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మన హృదయంలో ప్రభువైన యేసు క్రీస్తు పట్ల గొప్ప ప్రేమ మొదలవుతుంది.
  III.            మూడవదిగా, క్షమాపణా ఫలితం గొప్ప ప్రేమని గమనించండి. 42 వ. వచనం - "చెల్లించుటకు వారి యెద్ద ఏమియూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను". అందుకు పరిసయ్యుడైన సీమోను - "అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పెను" ఎవనికి ఎక్కువ క్షమించబడెనో వాడే ఎక్కువ భాద్యత కలిగి ఉంటాడని, వాడే ఎక్కువగా ప్రేమిస్తాడని ఒప్పుకున్నాడు.
A.    ఆ స్త్రీ అనేక పాపములు చేసిన విషయం ఆమెకు తెలుసు. ఆవిషయం యేసునకు కూడా తెలుసు కాని ఆయన ఆమెను క్షమించానని ప్రకటించాడు. ఆమె పాపములు విస్తారమైనవి గనుక ఆమెను పూర్తిగా క్షమించుట వలన గొప్ప ప్రేమ జనించెను. "ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించును". ఆమె ప్రేమించుట వలన క్షమించబడలేదు, కాని క్షమించబడుట వలన ప్రేమించింది. అ స్త్రీని క్షమించిన రీతిగానే సిమోనును కూడా క్షమించుటకు యేసు సిద్దముగా ఉన్నాడు. ఈ ఉపమానంలో ఇద్దరు ఋనస్థులు క్షమించబడ్డారు. ఇక్కడ సిమోను తన పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడినట్టుగాని, క్షమించబడుటలోని సంతోషాన్ని అనుభవించినట్టుగా గాని ఎటువంటి ఆధారాలు లేవు.
B.     44 నుండి 46 వచనాలలో పరిసయ్యుని వైఖరిని ఆ స్త్రీ వైఖరితో పోల్చి చెప్పుచున్నాడు. ఆ పరిసయ్యుడు యేసును ఘనపరచాలనే ఉద్దేశ్యంతో తన యింటికి ఆహ్వానించలేదు. కేవలం ఆయనను గమనించాలని తలంచాడు. యేసును నిందించుటకు ఆయనలో ఏదైనా ఒక దోషం కనబడుతుందని వెతుకుచున్నాడు. యేసు ఆ యింటికి అతిధిగా వచ్చాడు. ఆ దినాలలో ఒక అతిధికి ఇచ్చే గౌరవాన్ని కూడా ఆయనకు ఇవ్వలేదు. సాధారణంగా ఇటువంటి విందులలో ఆహ్వానించిన వాడు అతిధికి కాళ్ళు కడుగు కొనుటకు ఒక పెద్ద పాత్రతో నీళ్ళు అందిస్తాడు. కాని పరిసయ్యుడైన సిమోను ప్రభువైన యేసునకు అలా చేయలేదు. ఆహ్వానించిన వాడు అతిధిని గౌరవ సూచకంగా ముద్దుపెట్టి ఆహ్వానిస్తాడు. సిమోను అదికూడా చేయలేదు. ఆహ్వానించిన వాడు అతిధిని నూనెతో అభిషేకిస్తాడు. కాని ప్రభువునకు ఆ అభిషేకం జరగలేదు.
C.     పరిసయ్యుడు ఏదైతే చేయలేకపోయాడో వాటినన్నిటినీ ఆ స్త్రీ ప్రేమతో చేసింది. ఒక పెద్ద పాత్రలో నీళ్ళతో ఆయన పాదములను కడుగుటకు బదులుగా తన కన్నీటితో తడిపింది. తువ్వాలుతో యేసు పాదములను తుడవడానికి బదులు ఆమె తన తల వెండ్రుకలతో తుడిచింది. ఆయన ముఖమును ముద్దాడుటకు బదులు ఆమె వంగి అయన పాదములను ముద్దాడింది. ఆయనను అభిషేకించుటకు ఒలీవ నూనెకు బదులు విలువైన అత్తరును క్రీస్తు పాదములకు పూసింది. ఆ దినాలలో ఒక అతిధిని ఆహ్వానించే టప్పుడు పాటించే కనీస మర్యాదలు కూడా సిమోను పాటించలేదు. దానికి కారణం, అతడు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచలేదు. ఆ స్త్రీ అయితే క్రీస్తును విశ్వసించినందున తన ప్రేమను కనుబరచింది.
D.    "నీ పాపములు క్షమించబడి యున్నవి" అని యేసు ఆ స్త్రీతో చెప్పెను. సిమోను మరియు అక్కడ ఉన్న మిగిలిన అతిధులందరు ఎంతటి ఆశ్చర్యానికి గురైయుంటారో ఊహించండి. దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు. అందుచేత, యేసు ఈ సంఘటన ద్వారా తాను దేవుడనని తెలియజేయుచున్నాడు. ఆమె విశ్వాసమే ఆమెను రక్షించిందని యేసు అందరికి తేటపరచుచున్నాడు. ఆమె కార్చిన కన్నీరు, పెట్టిన ముద్దులు, పూసిన అత్తరు కాదు కాని, యేసు క్రీస్తు నందలి విశ్వాసమేనని బహు స్పష్టంగా తెలియజేసాడు.
ముగింపు: ఈ ఉపమానము యొక్క సారాంశం క్షమాపణ. దేవుని దృష్టిలో మనమందరం ఋణస్థులమే. "అందరు పాపము చేసియున్నారు" అని బైబిల్ చెబుతోంది. మన పాప ఋణమును తీర్చుకొను మార్గము మనలో ఎవని యొద్దను లేదు. యేసు మన ఋణమును భరించి, మనలను క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. తన పాపముల విషయమై పశ్చాత్తాపంతో యేసు వైపుకు తిరుగు ఎవనికైనను నిశ్చయముగా క్షమాపణ దొరుకును. నీవేప్పుడైనా యేసు నోద్దకు వచ్చి, నీ పాపములను క్షమించమని అడిగావా? ఒకవేళ ఇప్పటి వరకు నీవు అలా అడిగి యుండక పొతే ఈ రోజున అడుగు. నీవు యేసును ఎంతగా ప్రేమిస్తున్నావు? కొదరు క్రైస్తవులు ఇతరుల కంటే ఎక్కువగా ప్రభువైన యేసును ప్రేమిస్తున్నారన్నది సత్యం. కొందరు యేసును తక్కువగా ప్రేమిస్తున్నారు, మరికొందరైతే, యేసును తక్కువగా ప్రేమిస్తున్నారు. నీవు ఆయనను విస్తారముగా ప్రేమించ గలుగుచున్నావా? ఆయనకు నమ్మకముగా ఉండ గలిగేంతగా ఆయనను ప్రేమించ గలుగు చున్నావా? ఆయనను సేవించేంతగా ప్రేమించ గలుగుచున్నావా? క్రీస్తు మనకొరకు ఎంత చేసాడో అది మనం గ్రహించ గలిగితే, మనమాయనను విస్తారంగా ప్రేమించకుండా ఉండలేం. పరిశుద్ధమైన జీవితాలతో ఆయనను సేవించుటలోనే ఆయనను మనమెంత ప్రేమిస్తున్నామో కనబడుతుంది.

ప్రభువు మిమ్మును దీవించును గాక!

No comments:

Post a Comment