యేసు సిలువపై పలికిన యేడు మాటలపై ధ్యానాలు




యేసు సిలువపై పలికిన యేడు మాటలపై ధ్యానాలు

మొదటి మాట
"యేసు - తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను"      (లూకా 23:34)
రెండవ మాట
"అందుకాయన వానితో - నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" (లూకా 23:43)

మూడవ మాట
"యేసు తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి - అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి - యిదిగో నీ తల్లి అని చెప్పెను" (యోహాను 19:26,27)

నాల్గవ మాట
"మూడు గంటలకు యేసు - ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము" (మార్కు 15:34; మత్తయి 27:46)

ఐదవ మాట
అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు - దప్పిగొనుచున్నాననెను" (యోహాను 19:28)

ఆరవ మాట
"యేసు చిరక పుచ్చుకొని - సమాప్తమైనదని చెప్పి తలవంచి, ఆత్మను అప్పగించెను" (యోహాను 19:30)

ఏడవ మాట
"అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాననెను" (లూకా 23:46)
____________________________________________________________________

మొదటి మాట:
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" (లూకా 23:34).

యేసు సిలువపై పలికిన ప్రతి మాట దేవుడు ఎలాంటివాడో తెలియజేస్తుంది. ఈ మొదటి మాట దేవుని ప్రేమను, క్షమా గుణాన్ని తెలియజేస్తుంది.

మొదటిగా, "వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు" అని తనను సిలువ వేయుచున్న వారిని ఉద్దేశించి మాట్లాడుచున్నాడు. యూదులు, కక్ష గట్టి యేసును ఎలాగైనా చంపాలని నిర్ణయించు కున్నారు. పిలాతు, ఏమీ చేయలేక చేతులు కడిగేసుకున్నాడు. సైనికులు, వారి వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. శిష్యులు భయంతో పారిపోయారు. సామాన్య జనం ఏమీ చేయలేక విల విల లాడిపోయారు. కొందరైతే, హేళన చేసారు. మరికొందరు, అపహాస్యం చేసారు. సైనికులు ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేస్తున్నారు. యేసు, సిలువపై వ్రేలాడుచూ వీటన్నిటినీ గమనిస్తూ, "వీరేమి చేయుచున్నారో వీరెరుగరు" అని చెప్పాడు.

1 కొరింథి 2:8 - "... అది వారికి తెలిసియుండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి యుందురు". యేసును వారు గ్రహించలేని అంధకారం వారి హృదయములను కమ్మేసింది. అది వారి పాపమువలన కలిగిన తిరుగువాటు స్వభావం. ఒకవైపు సిలువ మనకు దేవుడు ఎంత ప్రేమామయుడో చూపిస్తూ ఉంది. మరోపైపు, మానవుడు ఎంత ఘోరమైన పాపముతో నిండుకొని యున్నాడో చూపిస్తుంది. సాక్షాత్తూ, దేవుడే దిగివచ్చి వారికి సత్యమును తెలియజేసినా వారు దానిని అంగీకరించుట లేదు సరికదా, వారు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. వారిని గూర్చి మనం చెడుగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆ స్థానంలో ఒకవేళ మనమున్నా అలానే ప్రవర్తించే వారమని మనం గ్రహించాలి. మనుష్యులందరూ ఒక్కటే. అందుచేతనే, ఈ రోజునకు కూడా మనలో చాలా మంది దేవుని సత్యాన్ని అంగీకరించక, వారి అజ్ఞానంలోనే బ్రతకడానికి ఇష్టపడుచున్నారు. వారి మనో నేత్రాలు వెలిగించబడాలని ప్రార్థిద్దాం.

రెండవదిగా, క్షమించమని వేడుకున్నాడు. ఆరోజు ఆయన ఆ ప్రార్థన చేయకుండా ఉంటే, మనకు రక్షణ లభించేది కాదు. ఆయన సహనంతో కాక, తన కోపంతో ప్రవర్తిస్తే, వారందరూ నశించి పోయేవారు. వారితోపాటు మనం కూడా మన పాపములలోనే నశించి పోయేవారం. అందు చేతనే తానూ సిలువ వేయబడునట్లు తన్ను తాను అప్పగించుకున్నాడు.

క్షమించాలని తండ్రిని వేడుకున్నాడు కాబట్టి మనుష్యులందరి పాపములు టోకుగా క్షమించబడతాయని కొందరు బ్రమిస్తారు. కాని అలా జరుగదు. ఎవరైతే, వారి పాపములను ఒప్పుకుని, యేసును (అనగా, దేవుడు అనుగ్రహించిన రక్షణ మార్గమును) తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారికే ఈ క్షమాపణ వర్తిస్తుంది. అంగీకరించని వారు ఇంకనూ వారి పాపములలోనే నిలిచి యున్నారు.

అయితే, దేవుడు ఒక వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించుటకు అవకాశం ఇస్తాడు. "మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన (దేవుడు) యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు" (అ.కా. 17:26-27). పుట్టుక - మరణం మానవుని పొలిమేరలు. ఈ మధ్య కాలంలో మానవుడు దేవుని తెలిసికోవాలి. అందుకు కావాల్సిన వాటన్నిటినీ దేవుడు ఏర్పరచాడు. ఆ తరువాత తీర్పు జరుగును. గనుక ఇప్పుడే ప్రభువును తెలిసికుని మారుమనస్సు పొందాలి.
__________________________________________________________________________

రెండవ మాట:
"నేడు నీవు నాతొ కూడా పరదైసులో నుందువు" (లూకా 23:43)

యేసు ఇద్దరు బందిపోటు దొంగల నడుమ సిలువ వేయబడ్డాడని మనకు తెలుసు. యేసును గూర్చిన లేఖనాలు ముందే ఈ విషయాన్ని ప్రవచించాయి. వారు కూడా యేసును మిగిలిన వారితో కలిసి హేళన చేసిన వారే. కాని, అకస్మాత్తుగా ఒక దొంగ యొక్క అంతరంగంలో ఎదో అలజడి రేగింది. అంతలోనే ఆశ కలిగింది. బహుశా, యేసు పలికిన మొదటి మాట అతని హృదయాన్ని కదిలించింది. అతనికి జ్ఞానోదయం అయింది.

ఆ దొంగ మాట్లాడిన విషయాలను గమనించండి. "వ్రేలాడదీయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచూ, నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము. మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే, రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే.మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదమును చేయాలేదని చెప్పి, ఆయనను చూచి, యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికోనుమనెను" (లూకా 23:39-42).

ఇందులో మనం గుర్తించాల్సిన విషయాలు: 1. ఆ దొంగలో దేవుని భయం కలిగింది. 2. తాను నేరస్థుడనని ఒప్పుకున్నాడు. 3. న్యాయం అర్థమయ్యింది. 4. యేసు ఎవరో గ్రహించాడు. 5. యేసు నందే తనకు నిరీక్షణ ఉందని గ్రహించాడు. 6. ఆలస్యం చేయకుండా వెంటనే యేసును వేడుకున్నాడు. 7. వాగ్దానం పొంది, సంపూర్ణ నిశ్చయతతో తన జీవితాన్ని ముగించాడు.

ఒక వ్యక్తి రక్షించ బడుటకు అతి ప్రధానమైన విషయం "దేవుని భయం". మొదట దేవుని భయం ఏర్పడితే మిగిలిన విషయాలన్నీ అర్థమైపోతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఎవరు యేసును అంగీకరిస్తారో వారే రక్షించబడతారు. ఇద్దరు దొంగలలో ఒకడే రక్షింప బడ్డాడు. మరో దొంగ విషయం ఏమయిందో మనకు తెలియదు.

ఇక్కడ మనకు అర్థమవ్వాల్సిన దేవుని లక్షణం - "ఆయన క్షమించుటకు సిద్దమనసు కలిగిన వాడు". నీ పశ్చాత్తాపం యధార్థమైనదైతే ఆయన నిన్ను వెంటనే, ఆలస్యం లేకుండా క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. మరలా ఆ పాపమును గూర్చి నిన్ను అడగడు. ఎటువంటి ఆంక్షలు లేకుండా, భేషరతుగా క్షమిస్తాడు. తన వద్దకు వచ్చినవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. గనుక నేడే ఆయనతో సమాధాన పడుదాం. ఒకవేళ నీవు రక్షింప బడిన వానివైతే, ఇతరులు ఆలస్యం చేయకుండా వెంటనే యేసును అంగీకరించునట్లు ప్రార్థిద్దాం.

 _______________________________________________________________________________


మూడవ మాట:
"అమ్మా ఇదిగో నీ కుమారుడు; ... ఇదిగో నీ తల్లి" (యోహాను 19:26,27)

"నీకు మేలు కలుగునట్లు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు భూమ్మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు" (ఎఫేసి 6:2-3).  నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము" (సామెతలు 23:22).

యేసు మానవునిగా ఈ భూమ్మీద బ్రతికిన కాలంలో ఒక మంచి మాదిరి కరమైన జీవితాన్ని జీవించాడు. ఆయనలో పొరపాటులు కనుగొనాలని అనేకులు విఫలయత్నం చేసారు. ఎవరూ ఆయనను వేలెత్తి చూపలేక పోయారు. ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని తలంచిన వారు కుయుక్తితో, తికమక ప్రశ్నలు సంధించి నప్పటికీ విజయం సాధించలేక పోయారు. ఆయనను బంధించి తీసుకు రావాల్సిందిగా యాజకులు తమ సేవకులను పంపితే, వారు తిరిగి వచ్చి "ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని" ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చారు (యోహాను 7:46).

యేసును గూర్చి " జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ యందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను" (లూకా 2:52). యేసు సిలువ వేయ బడుటకు ముందు అనేక మార్లు విమర్శింప బడ్డాడు. కాని అతని యందు ఎటువంటి దోషమును కనుగొనలేక పోయారు. ఆయన మనకు సంపూర్ణమైన మాదిరి.

గేత్సేమనే తోటలో యేసును సైనికులు బంధించినపుడు శిష్యులు పారిపోయారు. పేతురు మొదట సైనికులపై దాడి చేసినా, తరువాత భయపడ్డాడు. ఆ రాత్రంతా యేసును కనిపెట్టుకుని ఉన్నాడు. అయినా, తాను యేసుకు చిందిన వాడనని చెప్పుకోలేకపోయాడు. యేసు సిలువలో నుండి చూస్తున్నపుడు ఆయన సిలువ దగ్గర తన మాటలు వినిపించేంత దగ్గరగా ఆయన తల్లి మరియు ఆయన శిష్యుడైన యోహాను కనబడ్డారు. ఈ యోహానుకు "యేసు ప్రేమించిన శిష్యుడు" అను పేరు ఉంది. యేసు అతనిని ప్రేమించాడు. తానూ కూడా యేసును అంతగా ప్రేమించాడు కాబట్టే సిలువ దగ్గర ధైర్యంగా నిలుచున్నాడు. ప్రకటన గ్రంధాన్ని వ్రాసినవాడు ఈ యోహానే. పరలోక మర్మములు, అంత్య దినములలో జరుగు సంగతులు దేవుడాయనకు బయలు పరచాడు.

ఆయన తల్లి యెడల తన బాధ్యతను శిష్యునికి అప్పగిస్తున్నాడు. బహుశా అప్పటికే మరియ భర్తయైన యోసేపు మరణించి ఉండొచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. మరియ, యోసేపులకు పుట్టిన సంతానం యేసు బ్రతికి ఉన్న దినాలలో ఆయన యందు విశ్వాసముంచలేదు. గనుక వారి పరిస్థితి మనకు పూర్తిగా తెలియదు. అయితే, యేసు మరనావస్థలో ఉండి కూడా తన తల్లి యెడల తన బాధ్యతను నేరవేర్చుచున్నాడు.

పిల్లలు తమ తల్లి దండ్రుల బాధ్యత వహించాలి. వారి బాగోగులను చూడాలి. విశ్వాసులైన వారు మరి బాధ్యతగా వ్యవహరించాలి. అత్తమామలను కూడా తల్లిదండ్రులతో సమానంగా చూడాలి. కుటుంబ బాంధవ్యాలలో అందరి యెడల వారి వారి బాధ్యతలను నెరవేర్చాలి. జీవిత భాగ స్వామి పట్ల, పిల్లల యెడల, తల్లిదండ్రుల యెడల, అత్తా మామల యెడల మన బాధ్యతలను నెరవేర్చాలి. కుటుంబం లోని ఇతర వ్యక్తులను కూడా మనం పట్టించుకోవాలి. "నీ రక్త సంబందికి నీ ముఖమును త్రిప్పుకోవద్దు" అని బైబిల్ చెప్పు చున్నది. "ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపక పోయిన యెడలవాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును" (1 తిమోతి 5:8).

యేసు ప్రేమించిన ఆ శిష్యుడు కూడా వెంటనే ఆమెను తన యింటను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం క్రీస్తుకు నిజమైన శిశ్యులమైతే వాదాలు పెట్టుకోకుండా, విసుగుకోకుండా, ఎటువంటి పక్షపాతాలు లేకుండా, నిర్లక్ష్యం చేయకుండా, సాకులు చెప్పకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా, హక్కులు - ఆస్తులను గూర్చి మాట్లాడకుండా, వంతులేసుకోకుండా అదే ఒక భాగ్యంగా మన బాధ్యతలను నిర్వహించాలి. మన బాధ్యతలను వేరే వారి మీదకు నెట్టకూడదు (మత్తయి 15:1-10).

ఇది కేవలం చెప్పాతనికి మాత్రమె సరిపోతుందని అనుకోకుండా, పాటించాలి. మనం మన సాక్ష్యాన్ని ఎక్కడ వెతుకుచున్నాం? చాలా సార్లు మనం సాక్ష్యాన్ని స్వస్థతలలోను, అద్భుతాలలోను, ఆశీర్వాదాలలోను, అపాయాల నుండి కాపాడ బడుటలోను, పదోన్నతులలోను, కీర్తి ప్రతిష్టలలోను, భక్తి కార్యక్రమాలలోను వెతుక్కుంటాం. కాని మన బంధుత్వాలలోను, బాధ్యతలను నేరవేర్చుటలోను, ఇతరులతో మనం కలిగి ఉన్న సంబంధాలలోను, క్రమమైన జీవిత విధానంలోను, నైతిక ప్రవర్తనలోను మన క్రైస్తవ సాక్ష్యం కనబడుతుంది. మన కుటుంబాలు అన్యుల మధ్య మాదిరికరమైన కుటుంబాలుగా, దేవుని మహిమను కనుపరచేవిగా ఉండాలి. అప్పుడే దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఇతరులు అనగా, మనలను చూస్తున్న వారు గ్రహిస్తారు. సువార్త ఫలిస్తుంది. మన కుటుంబ బాంధవ్యాలను సరిచేసుకుందాం. ఒకరికొరకు ఒకరు ఆశక్తితో పనిచేద్దాం. ప్రార్థిద్దాం. ప్రోత్సాహకరంగా నిలుద్దాం.
___________________________________________________________________________

నాల్గవ మాట:
"నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడచితివి" (మత్తయి 27:46, మార్కు 15:34)

మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను. ఇంచు మించు మూడు గంటలప్పుడు యేసు ఈ మాటలు పలికెను. ఈ మాట చాలా కీలకమైనది. దీని ఆంతర్యం గ్రహించడం కష్టమే. అయినా తెలిసికొనుటకు ప్రయత్నిద్దాం.

యేసు పుట్టి నప్పుడు ఆకాశంలో ఆ రాత్రి గొప్ప వెలుగు పుట్టెను. ఆ కాంతిని చూచి గొల్లలు భయపడ్డారు (లూకా 2:9). యేసును గూర్చి సాక్ష్యమిస్తూ యోహాను "వెలుగు" అని ప్రస్తావించెను. "నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు మనుష్యులను వెలిగించు చుండెను" (యోహాను 1:4,9). "నేను లోకమునకు వెలుగై యున్నాను" అని యేసు తనను గూర్చి తాను చెప్పాడు (యోహాను 8:12)

ఇప్పుడైతే, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్మినట్లుగా గమనిస్తున్నాము. నిజానికి ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా ప్రకాశిస్తాడు. ఎక్కువ వెలుగు ఉండవలసిన సమయంలో చీకట్లు ఆవరించడం గుర్తించదగ్గ విషయం. ఇది అసామాన్యమైన చీకటిగా గ్రహించాలి. లూకా ఈ విషయాన్ని 23:45 వ. వచనంలో "సూర్యుడు అదృశ్యుడాయెను" అని వర్ణిస్తున్నాడు. సూర్యుడు ఆకాశంలో కనబడలేదు. అంతగా చీకటి కమ్మెను.

ఈ చీకటిని గూర్చి సువార్తలలో గాని, బైబిల్లో వేరు వాక్యభాగాల్లో గాని వివరణ లేదు. గనుక అనేకులు అనేక రకాలుగా ఈ చీకటిని గూర్చి వ్యాఖ్యానించారు. లోకంపై ఆకస్మాత్తుగా చీకటి ఆవరించడం గూర్చి "మానవుల దుష్ట క్రియలపై దేవుని తీర్పు" అని ధర్మశాస్త్రోపదేశకులు "బబులోను తల్ముద్" అనే గ్రంధంలో బోధించారు. అదే నిజమైతే, దేవుడు ఇక్కడ ఉద్దేశ్య పూర్వకంగా ఈ చీకటిని కలిగించి, లోకమునకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. పతనమైన మనిషి తన తిరుగు బాటు స్వభావంతో యేసు క్రీస్తును సిలువ వేయుట ద్వారా అతి భయంకరమైన తప్పు చేస్తున్నాడు.

అందుచేత ఈ చీకటి దేవుని తీర్పుగా మనం అనేక వాక్య భాగాల వెలుగులో గుర్తించవచ్చు. యెషయా 5:30 లో దేవుని ఉగ్రతను గూర్చి యెషయా మాట్లాడుచూ  దానిని అంధకారముగా, వెలుగు మేఘములచేత చీకటి యగుటగా వివరించాడు. అలానే, 13:10 లో "ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును" అని వివరించాడు. అదేరీతిగా, యోవేలు 2:2 లోను, జెఫన్యా 1:14,15 లోను, 2 పేతురు 2:4 లో,యూదా 6 వ. వచనంలో, మత్తయి 8:12, 22:13, 25:30 మొదలైన వచనాలలో "చీకటి" దేవుని ఉగ్రతతో పోల్చబడింది.

మానవుని పాపమంతటిని భరిస్తూ యేసు సిలువ వేయబడ్డాడు. గనుక పాపము యెడల దేవుని వైఖరి కనబడుచున్నది. పాపము యెడల దేవుడు కఠినంగా వ్యవహరిస్తున్నాడు. దేవుని ఉగ్రత యేసుపై క్రుమ్మరించబడింది. అసామాన్యమైన ఈ చీకటిని గూర్చి మనం గ్రహించ వలసినది అదే.

ఆ చీకటిలో "దేవుడు దేవుని విడచిపెట్టాడు". అందుకే యేసు "నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడచితివి?" అని ప్రశ్నిస్తున్నాడు. ఇది బహు వేదనకరమైన ఎడబాటు. "నీ కన్ను దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది" అని హబక్కూకు 1:13 లో వ్రాస్తున్నాడు. కాని యేసు సమస్త మానవాళి పాపమును తన పైన వేసుకున్నాడు. "మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచ బడెను. మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను" (యెషయా 53:5). రోమా 4:25, 1 కొరింథి 15:3, 2 కొరింథి 5:21, గలతీ 3:13, 1 పేతురు 2:24, 3:18, 1 యోహాను 4:10, మత్తయి 20:28 మొదలైన వచనాలను చదవండి.

దీనిని గ్రహించడం కష్టమైనా, తండ్రితో కుమారుని ఎడబాటు మనకోరకే అని గమనించి, మన యెడల ఆయన ప్రేమకై దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
__________________________________________________________________________

ఐదవ మాట:
"దప్పిగొనుచున్నాను" (యోహాను 19:28)

యేసు గురువారం రాత్రి గేత్సేమనే తోటలో బంధించబడ్డాడు. అప్పటి నుండి రాత్రంతా వారు యేసు మానసికంగా హింసించారు. ఆ తరువాత వారు అధికారుల వద్దకు తీసుకు వెళ్ళారు. అక్కడ కూడా యేసు అనేక రీతులుగా విమర్శింప బడ్డాడు. మొదట పిలాతు, తరువాత హేరోదు, మరలా పిలాతు దగ్గర యేసును విమర్శించారు. యేసును విడిపించాలని పిలాతు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. యేసు భౌతికంగా పూర్తిగా అలసిపోయాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు సహించాడు. తలమీద ముండ్ల కిరీటం ఉంచారు. దాని మీద కొట్టారు. బరువైన సిలువను ఆయనపై మోపారు. అడుగడుగునా రక్తం ఏరులై పారింది. సిలువలో మేకులతో గుచ్చారు. యేసు సంపూర్ణ మానవుడు. గనుక ఈ పరిస్థితుల మధ్య దాహం సహజమే.

అక్కడ నిలిచి యున్న వారిలో కొందరు వెంటనే స్పందించారు. చేదు చిరక నందించారు. వారు యేసును హేళన చేసే మనస్సుతోనే వ్యవహరిస్తున్నారు. జరుగుచున్న విషయాలను కొంచెమైనా ఆలోచించడం లేదు. కొంచెం ఆలోచించినా వారికి యేసు అర్థమయ్యేవాడు. కాని వారి హృదయాలు పూర్తిగా అందకారంతో నింపబడి పోయాయి. అందుకే ఆయన ఎలీయాను పిలుచుచున్నాడని అనుకున్నారు. ఎదో అద్భుతం జరుగుతుందేమో అని చూచారు. కాని సత్యాన్ని గ్రహించలేదు.

మరోవైపు, తీవ్రమైన ఆత్మ సంబంధమైన వేదన అనుభవించాడు. దేవుని నుండి ఎడబాటు. అలసిపోయి ఉన్నాడు. లేఖనాలు నెరవేరునట్లు ఆయన దప్పిగొనెనని వ్రాయబడింది. యేసు కీర్తనల గ్రంధం 22 వ. కీర్తనలోని వచనాన్ని ఎత్తి మాట్లాడుచున్నాడు. వినిన వారికి అది కూడా అర్థం కాలేదు.

వారు యేసు కిచ్చిన స్పందన నిర్లక్ష్యంతో కూడినది. ఆయన పిలుపునకు స్పందించిన తీరు యేసును సంతృప్తి పరచలేదు. "దాహం" దేవుని ఆశను సూచిస్తోంది. విశ్వాసుల యెడల దేవుని ఆశ - మారుమనసుకు తగిన ఫలములు (మత్తయి 21:18). బద్దలైన సందులలో నిలబడువాడు కావాలి (యేహెజ్కేలు 22:30). ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో దేవుని ఎదుట నిలువబడి సమాధాన పరచువాడు కావాలి. నీవెలా స్పందిస్తున్నావు? దేవుని ఎదుట విజ్ఞాపన చేయుము.

లోకము దేవునితో సమాధాన పదాలని దేవుడు ఆలస్యము చేయుచున్నాడు (2 పేతురు 3:9). ఇది దేవుని తీవ్రమైన కోరిక. అందు చేతనే అనేక హెచ్చరికలను దేవుడు పంపుచున్నాడు. విశ్వాసిగా నీవు దానిని గ్రహించి లోకమునకు యేసును పరిచయం చేయాలి.

దేవుని సంతృప్తి పరచు నట్లు మన జీవిత విధానమును సరి చేసుకుని జీవిద్దాం. మనలో నుండి జీవజలపు ఊటలు ప్రవహించు నట్లు పవిత్రమైన జీవతాలను కలిగి ఆయనను సేవిద్దాం. చేదును తొలగిద్దాం. మధురమైన జీవిత ఫలముల చేత దేవుని తృప్తి పర్చుదాం.
__________________________________________________________________________

ఆరవ మాట:
"సమాప్తమైనది" (యోహాను 19:30)

యేసు ఈ మాటలు పలికినపుడు ఆయన తన సిలువ శ్రమలను గూర్చి మాట్లాడుట లేదని మనకు తెలుసు. అయితే, దేని గూర్చి మాట్లాడు చున్నాడు?

"చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని" (యోహాను 17:4). ఇంతకీ దేవుడు యేసునకు అప్పగించిన పని ఏమి? యేసు మరొక చోట "నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను" (లూకా 19:10) అని తనను గూర్చి తాను చెప్పు కొనెను. "మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును యిచ్చుటకును వచ్చెను"(మత్తయి 20:28). "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).

పై వచనాలన్నిటిని బట్టి మనకు అర్థమయ్యే విషయం యేసు మానవుల రక్షణార్థమై వచ్చాడు. వారిని దేవునితో సమాధాన పరచుటకు వచ్చాడు. తన ప్రాణ త్యాగము ద్వారా మానవులకు రక్షణ మార్గమును ఏర్పరచుటకు వచ్చాడు. మనుష్యులు తమ పాపములకు పొందాల్సిన నరకము నుండి తప్పించి, నిత్యజీవమునకు వారసులుగా చేయుటకు వచ్చాడు. ఇది కేవలం సిలువలో మరణించుట ద్వారానే సాధ్యమౌతుంది. ఆ కార్యము ఇప్పుడు నెరవేరింది. దేవుని ఉగ్రతను సంపూర్ణంగా భరించాడు. మరణము యొక్క బలము గల సాతానుని బలహీనునిగా చేసాడు. సిలువలో సాతానుడు ఓడిపోయాడు. ఇకమీదట సాతానుడు మానవులను బంధించి యుంచలేడు. దేవుని మహిమ మానవులపై ప్రసరించుచున్నది. వారి మనో నేత్రములను తెరచి చూడగలిగితే చాలు.

సమాప్తమైనదని చెప్పిన తరువాత యేసు బిగ్గరగా కేక వేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇది యేసు యొక్క విజయ కేక. అప్పుడే బండలు బ్రద్దలై పోయాయి. గర్భాలయపు తెర పై నుండి క్రిందికి చినిగిపోయెను. ఈ తెరను గూర్చి మనం గ్రహించాలి. పూర్వం దేవాలయంలో దేవుని సన్నిధిని మానవుల నుండి ఈ తెర వేరుచేసేది. ఆ తెర మీద చెక్కిన కేరూబులు ఉండేవి. దేవుని మీద తిరుగు బాటు చేసిన మానవుడు ఏదేను తోట నుండి తరిమి వేయబడిన తరువాత దేవుడు ఆ మార్గములో కెరూబులను ఉంచాడు (ఆ.కా. 3:24). అదే విషయం సూచన ప్రాయంగా ఈ గర్భాలయపు తెర పై చెక్కబడింది. ఇప్పుడది చినిగి పోయింది. అనగా దేవుడే తన సన్నిధిలోనికి మార్గాన్ని తెరిచాడు.

హెబ్రీ 10:19-22 వరకూ ఉన్న వాక్య భాగమును చదవండి. ఆ రీతిగా మానవుని కొరకు యేసు రక్షణ మార్గాన్ని సిద్దపరచాడు గనుక సమాప్తమైనదని పలికాడు. మనకొరకు దేవుడు ఏర్పరచిన మార్గములో మనము తప్పిపోకుండా నడచుకొనునట్లు ప్రార్థన చేద్దాం.
___________________________________________________________________________

ఏడవ మాట:

తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నాను (లూకా 23:46)

ఇది గొప్ప నిశ్చయతతో కూడిన మాట. దేవుని యందు ఉన్నవారికే కలిగే నిశ్చయత.

ఈలాంటి మాటనే స్తెఫను కూడా పలికాడు. "ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచూ -యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకు చుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి" (అ.కా. 7:59).

అనేక మంది క్రైస్తవులు వారు పరలోక రాజ్యం చేరుతారో లేదో ననే అనుమానంతోనే జీవిస్తున్నారు. కాని యేసులో మనకున్న నిశ్చయతను మనం గ్రహించాలి.

క్రైస్తవులలో ఈ క్రింది గుంపులను మనం గమనించవచ్చు:
  1. వారు రక్షించబడిన వారని వారికి వారే భ్రమిస్తారు - మత్తయి 7:21 - వీరికి నిశ్చయత ఉండదు.
  2. వారు రక్షించబడిన వారేనని చూచినవారు తలస్తారు - 1 యోహాను 2:19 - వీరికి నిశ్చయత ఉండదు.
  3. వారు రక్షించ బడిన వారే గాని, ఆ ప్రకారం జీవించరు - 1 కొరింథి 3:1 - వీరికి నిశ్చయత ఉండదు.
  4. రక్షింప బడి, ఆ ప్రకారం జీవించువారు. - వీరికి సంపూర్ణ నిశ్చయత ఉంటుంది.


అయితే, రక్షించ బడిన వారిలో కూడా కొందరు ఈ నిశ్చయత లేక బాధ పడుచూ ఉంటారు. దానికి కొన్ని కారణాలున్నాయి.
  1. వారు రక్షించబడిన తేదీ /సమయం వారికి గుర్తుండక పోవడం
  2. బాహ్య ఆచారాలు చేయలేక పోవడం వలన
  3. వారిలో ఇంకా పాపపు ఛాయలు కనబడుచుండుట వలన
  4. మాటి మాటికి పాపంలో పడిపోవుచుండుట వలన
  5. పాపపు ఆలోచనలు కలుగు చుండుట
  6. సరియైన బోధ అందక పోవడం వలన


యేసు సంపూర్ణంగా దేవుని వానిగా జీవించాడు. గనుక ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. యేసు సిలువలోనుండి ఎక్కడికి వెళ్ళాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. దానికి సమాధానం ఈ మాటలలోనే ఉంది. యేసు సిలువలోని దొంగతో "నేడు నీవు నాతొ కూడా పరదైసులో ఉందువు" అని చెప్పాడు. అంటే, యేసు పరదైసులో ఉన్నాడని గ్రహించాలి. అదే సమయంలో పరలోకం వేరు, పరదైసు వేరు అనే బోధ కూడా ఉంది. అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే, యేసు తన ఆత్మను దేవుని చేతికి అప్పగించాడు. అనగా, దేవుని వద్దకే వెళ్ళాడు. పరదైసు, పరలోకం రెండూ ఒకటే అని గ్రహించాలి. గనుక ఒక విశ్వాసి చనిపోతే దేవుని సన్నిధిలోనికే వెళతాడు. మరలా వేర్వేరు మెట్లుండవు.

ఇది మన క్రియల వలన కలిగినది కాదు. దేవుని కృప వలననే అయినది. గనుక మన భక్తి మీద ఆధారపడక, దేవుని కృప మీద ఆధారపడుచూ, సంపూర్ణ నిశ్చయతతో దేవునికి అనుకూలముగా ముందుకు సాగిపోవుదము.

దేవుడు మిమ్మును దీవించును గాక.­­­­­­­­­­­­­­­­­­­

No comments:

Post a Comment